ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ తో తలైవా టాలీవుడ్ ఎంట్రీ.. ఆ సినిమా ఏంటో గెస్ చేయగలరా!?
on Aug 23, 2023
ప్రస్తుతం 'జైలర్'గా బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు తలైవా రజినీకాంత్. ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాతో.. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చి వార్తల్లో నిలుస్తున్నారీ సూపర్ స్టార్. తెలుగులోనూ ఈ మూవీ.. రూ. 70 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది.
ఇదిలా ఉంటే, పేరుకి కోలీవుడ్ సూపర్ స్టార్ అయినప్పటికీ.. తెలుగు నేలపైనా తనదైన ముద్ర వేశారు రజినీకాంత్. తెలుగులో నేరుగా కొన్ని చిత్రాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు భలేగా వినోదం పంచారాయన. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. టాలీవుడ్ లో రజినీకాంత్ నటించిన మొట్టమొదటి సినిమా ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్. ఆ చిత్రమే.. 'అంతులేని కథ'. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన ఈ సినిమాలో జయప్రద ప్రధాన పాత్రలో నటించగా.. ఆమెకి అన్నగా ఓ ముఖ్య పాత్రలో దర్శనమిచ్చారు రజినీకాంత్. 1976 ఫిబ్రవరి 27న విడుదలైన ఈ సినిమాకి.. తమిళ చిత్రం 'అవళ్ ఒరు తొడర్ కథై' (1974) ఆధారం. ఇందులో రజినీకాంత్ పై చిత్రీకరించిన "దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి" అనే పాట ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ గీతాన్ని మధుర గాయకుడు కేజే ఏసుదాసు ఆలపించారు.
అన్నట్టు.. రజినీకాంత్ తెలుగులోనే తొలిసారిగా పూర్తి స్థాయి పాత్ర చేశారు. 'చిలకమ్మ చెప్పింది' (1977) పేరుతో రూపొందిన ఈ సినిమాకి ఈరంకి శర్మ దర్శకత్వం వహించగా.. శ్రీప్రియ, సంగీత ముఖ్య పాత్రల్లో కనిపించారు. 'చిలకమ్మ చెప్పింది' 1977కిగానూ 'ఉత్తమ చిత్రం'గా నంది పురస్కారం అందుకోవడం విశేషం.
Also Read